గ్రేటర్ వరంగల్ లో నాడు ఆర్టీసీ భూములు లీజుకు.. నేడు డిపో జాగకు దిక్కులు!
గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అనాలోచిత నిర్ణయంతో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ భూములను బీఆర్‌ఎస్ నేతలకు లీజు పేరుతో అప్పనంగా కట్టబెట్టడంతో ఇప్పుడు బస్సులు నిలిపేందుకు చోటు లేని పరిస్థితి నెలకొంది. కేంద్రం వరంగల్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా.. ఆర్టీసీకి డిపో ఏర్పాటు అనివార్యంగా మారింది. ఆర్టీసీ భూములు లీజుల పేరుతో బీఆర్‌ఎస్ నేతల వద్ద ఉండడంతో.. బయటి భూములను వెతకాల్సి వస్తోంది.
వరంగల్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో రూ.వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 33 నుంచి 90 ఏండ్లకు కట్టబెట్టింది. ఇప్పుడు సంస్థకు అవసరమైన స్థలాలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వొద్దంటూ అప్పటి అపొజిషన్ పార్టీలు, సంస్థ కార్మికులు, నగర ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా బీఆర్‌ఎస్ సర్కార్ లెక్క చేయలేదు. ఎలక్ట్రిక్ బస్సుల డిపో ఏర్పాటుకు కనీసం 5 నుంచి 6 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వ భూముల కోసం అధికారులు వెతుకుతున్నారు.
మాజీ ఎంపీకి రూ.100 కోట్ల భూములు..
హనుమకొండ హంటర్ రోడ్‌లో మెయిన్ రోడ్‌కు ఆనుకుని ఉన్న ఆర్టీసీ టైర్ రిట్రేడింగ్ యూనిట్‌కు చెందిన సుమారు 16,250 చదరపు గజాల భూమిని గత ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ భూముల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాకతీయ జూపార్క్, భద్రకాళి బండ్ సమీపంలో ఉన్న ఈ స్థలం కమర్షియల్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉండగా, అప్పటి బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కుటుంబ సభ్యుల ‘రోని భారత్ గ్యాస్’ పేరిట నెలకు రూ.4 లక్షల అద్దెకు 2019 మార్చి 20న లీజ్ ఒప్పందం కుదిరింది. ఈ లీజులో మరికొందరు పార్టీ నేతలకు కూడా వాటాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.