ఐటీ ఫ్రెషర్లకు షాక్.. 20వేల మంది రిక్రూట్మెంట్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్.. ఎందుకంటే?
దేశంలోని టాప్ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తన రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత, నిజాయితీకి పెద్దపీట వేసే ఈ సంస్థ.. సుమారు 20వేల మందికి పైగా అభ్యర్థులకు నిర్వహించాల్సిన ఆన్‌లైన్ పరీక్షలు, ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసింది. కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్లు, ఒకరి స్థానంలో మరొకరు పరీక్షలు రాసినట్లు గుర్తించడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ట్రైనీ, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై ఈ ప్రభావం పడింది.
రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ తన భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసింది. పరీక్షల నిర్వహణలో కొత్త రూల్స్, అదనపు సేఫ్టీ చర్యలను ప్రవేశపెట్టింది. ఈ మార్పుల కారణంగానే షెడ్యూల్ చేసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ అభ్యర్థులకు ఇమెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. అయితే ఈ తాత్కాలిక వాయిదా వల్ల కంపెనీ భవిష్యత్తు రిక్రూట్మెంట్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతిభావంతులైన యువతను రిక్రూట్ చేసుకోవాలనే కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ తన రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కోసం ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ అనే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి దాదాపు 15 మిలియన్ల మంది వినియోగదారులతో దూసుకుపోతోంది. గతంలో పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నియామకాలు చేపట్టిన ఇన్ఫోసిస్.. నకిలీ ప్రొఫైల్స్, సాంకేతిక సమస్యల కారణంగా గత ఏడాది నుండి ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ తో కూడిన హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తోంది. టాలెంట్ నిరూపించుకోలేని వారి విషయంలో సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది మైసూర్ క్యాంపస్‌లో అంతర్గత పరీక్షల్లో 3 సార్లు ఫెయిల్ అయిన 600 మంది ట్రైనీలను కంపెనీ ఇంటికి పంపిన సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఉద్యోగాలకు ఎంత క్రేజ్ ఉందో లెక్కలే చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం FY26లో ఈ సంస్థకు ఏకంగా 58 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అందులో 4లక్షల 50వేల 901 మందిని ఇంటర్వ్యూ చేసి.. 87వేల 286 మందికి ఉద్యోగ ఆఫర్లను అందించింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లోనూ దూసుకుపోతున్న ఈ సంస్థ FY26లో 20వేల మందికి పైగా ఫ్రెషర్లను చేర్చుకుంది, FY27లోనూ ఇదే స్థాయిలో రిక్రూట్‌మెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.