ఏపీలో పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల సంఘం
అమరావతి: నవంబరు 1న జరిగే పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 100 పట్టణ స్థానిక సంస్థలకు గాను 8 పూర్తి స్థాయిలో ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 స్థానాల్లో పోలింగ్‌కు సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని మల్లికార్జున వెల్లడించారు. నవంబరు 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తుపాను, వర్షాల ఇబ్బందుల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదికలను బట్టి, అవసరమైతే నవంబరు 2న పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నవంబరు 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్నారు.