UK PM: స్టార్మర్ నెత్తిన ‘ఎప్‌స్టీన్’ పిడుగు.. యూకే ప్రధాని రేసులో షబానా
ఇంటర్నెట్ డెస్క్: ఎప్‌స్టీన్ ఫైళ్ల (Epstein scandal) వివాదం బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒకవేళ స్టార్మర్ వైదొలిగితే యూకే తదుపరి ప్రధాని (UK PM)గా ఎవరు ఎన్నికవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఈ రేసులో మహిళా ఎంపీ షబానా మహ్మద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ చరిత్రలోనే పాక్ మూలాలు ఉన్న తొలి ముస్లిం ప్రధానిగా షబానా నిలవనున్నారు.
ఎవరీ షబానా..?
షబానా మహ్మద్ (Shabana Mahmood) ప్రస్తుతం స్టార్మర్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కొనసాగుతున్నారు. 45 ఏళ్ల షబానా 2010 నుంచి బర్మింగ్‌హమ్ లేడీవుడ్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా బారిస్టర్ అయిన ఆమె.. ఆ తర్వాత రాజకీయాల వైపు ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. అనతికాలంలోనే పార్టీలో ఉన్నత పదవులకు చేరుకున్నారు.