మ్యాచ్ మధ్యలో అది అవసరమా?: సునీల్ గావస్కర్, రవిశాస్త్రి
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ బ్యాటింగ్ సమయంలో పవర్‌ప్లే ముగిసిన తర్వాత షెడ్యూల్డ్ బ్రేక్ ఇచ్చారు. అప్పుడు ఆటకు మూడు నిమిషాల విరామం దొరికింది. ఆ సమయానికి టీమ్‌ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అప్పుడు మైదానంలోని లైట్లన్నీ ఆర్పేసి.. లేజర్ షో నిర్వహించారు. ఆట మధ్యలో అలా చేయడం అవసరమా.. అని టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశ్నించారు. అది బ్యాటర్ల ఏకాగ్రత, కంటిచూపును ప్రభావితం చేస్తుందని వారు వాపోయారు.
‘రెండున్నర లేదా మూడు నిమిషాల డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షో నిర్వహించడం బ్యాటర్లకే కాదు, ఎవరికైనా మంచిది కాదు. అది కంటి చూపును ప్రభావితం చేస్తుంది’ అని కామెంట్రీలో సునీల్ గావస్కర్ అన్నాడు.
‘ఐపీఎల్‌లో లేజర్ షో నిర్వహించడం వరకు ఫర్వాలేదు. కానీ నాకౌట్ మ్యాచుల్లో, అదీ కూడా డ్రింక్స్ బ్రేక్ సమయంలో అలా చేయడం సమంజసం కాదు. అది ఆటగాళ్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని రవిశాస్త్రి సైతం అభిప్రాయపడ్డాడు.