తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ.. శాసన మండలిలో గందరగోళం
అమరావతి: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల అనంతరం తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలి ఛైర్మన్ మోషేను రాజు చర్చకు అనుమతించారు. దీనికోసం మొత్తం గంట సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. వైకాపాకు 30 నిమిషాలు, తెదేపాకు 20 నిమిషాలు, ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు 10 నిమిషాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం వైకాపాకు మద్దతుగా స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. నెయ్యి కల్తీ అంశంపై ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హెరిటేజ్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీతో హెరిటేజ్‌కి ఏమాత్రం సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆధారాలు లేకుండా పదేపదే ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఏ ప్రభుత్వ సంస్థలకూ నెయ్యి సరఫరా చేయకూడదని హెరిటేజ్ నిర్ణయించుకుందని ఆయన గుర్తు చేశారు. కానీ దాన్నే ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తూ తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.