భారత్ సరికొత్త ఆయుధం.. శాటిలైట్ లేకున్నా వేటాడే 'శేషనాగ్-150' డ్రోన్..
ఆధునిక యుద్ధ రంగంలో క్షిపణుల కంటే డ్రోన్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే టెక్నాలజీపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాయి. ఇరాన్‌కి చెందిన'షాహెద్-136', అమెరికాకు చెందిన 'లూకాస్' డ్రోన్లు ప్రస్తుతం యుద్ధ గమనాన్ని మారుస్తున్న తరుణంలో, భారత రక్షణ రంగంలో 'శేషనాగ్-150' ఒక సంచలన ఆయుధంగా నిలుస్తోంది.
బెంగళూరుకు చెందిన డిఫెన్స్ స్టార్టప్ 'న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్' ఈ శక్తివంతమైన స్వదేశీ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఒక లాంగ్ రేంజ్ స్వర్మ్ అటాక్ డ్రోన్. అంటే ఇది ఒక్కటిగా కాకుండా గుంపుగా వెళ్లి శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ముంచెత్తుతుంది. దాదాపు ఏడాది క్రితమే ఇది తన మొదటి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ పెద్ద సంఖ్యలో తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లను ప్రయోగించి భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసింది. ఆ సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన లాంగ్ రేంజ్ డ్రోన్ల అవసరం ఎంత ఉందో అర్థమైంది. దీంతో శేషనాగ్-150 అభివృద్ధి వేగవంతమైంది. ఇది కేవలం డ్రోన్ మాత్రమే కాదు.. శత్రువును వెతికి వేటాడే ఒక మేధోవంచిత ఆయుధం.
శేషనాగ్-150 సామర్థ్యం అద్భుతమనే చెప్పాలి. ఇది 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. 5 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఉండి లక్ష్యాలను పర్యవేక్షించగలదు. శత్రువుల కదలికలను గుర్తించి.. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. ఇది దాదాపు 25 నుండి 40 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. శత్రువుల మౌలిక సదుపాయాలను, వాహనాలను ధ్వంసం చేయడానికి ఇది సరిపోతుంది.
ఈ డ్రోన్ అసలు బలం దాని 'మదర్ కోడ్'లో ఉంది. నేటి కాలంలో చిన్న విమానాలను తయారు చేయడం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని తెలివైన ఆయుధాలుగా మార్చే 'అల్గారిథమిక్ ఇంజిన్' అభివృద్ధి చేయడమే అసలైన సవాలు. శేషనాగ్-150 స్వతంత్రంగా లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేయగలదు. మానవ ప్రమేయం తక్కువగా ఉన్నా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.