ఖమేనీ చనిపోయినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం IRGC.. ఇది సైన్యం కాదు అంతకు మించి..
ప్రపంచంలో ఏ దేశానికైనా సైన్యం ఒకటే ఉంటుంది.. కానీ ఇరాన్ లో మాత్రమే సైన్యానికి, ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగే వ్యవస్థ ఉంది. అదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC).. ఇరాన్ రాజకీయ, సైనిక మరియు ఆర్థిక ముఖచిత్రంలో ఐఆర్ జీసీది అత్యంత కీలకమైన పాత్ర.
వాస్తవానికి దేశ సైన్యం కంటే, ప్రభుత్వానికంటే ఈ రివల్యూషనరీ గార్డ్స్ కే అధికారాలు ఎక్కువ. ఈ విప్లవ సైన్యం కేవలం ఇరాన్ సుప్రీం లీడర్ కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, ప్రధాని, అధ్యక్షుడు.. తదితర వ్యవస్థలకు ఇది ఎలాంటి బాధ్యత వహించదు. దేశ సరిహద్దులను కాపాడటంతో పాటూ ఇస్లామిక్ విప్లవ ఆశయాలను రక్షించడం ఐఆర్ జీసీ ప్రధాన ఉద్దేశ్యం.
ఇరాన్‌లో 1979 లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత, అప్పటి సుప్రీం లీడర్ ‘‘ఆయతొల్లా రుహొల్లా ఖొమేనీ’’ ఈ దళాన్ని స్థాపించారు. అప్పట్లో సాధారణ సైన్యం పాత రాజు (షా) పట్ల విధేయత చూపుతుందనే భయంతో, కేవలం ఇస్లామిక్ వ్యవస్థకు మరియు సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఈ ప్రత్యేక దళాన్ని రూపొందించారు. కాలక్రమేణా ఇది దేశంలోని అన్ని విభాగాలపై పట్టు సాధించి, ఒక శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది.
ఐఆర్జీసీకి స్వంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. దీనిలోని రెండు ప్రధాన విభాగాలు కాగా, ఒకటి.. ఖుద్స్ ఫోర్స్ (ఐఆర్ జీసీ యొక్క విదేశీ విభాగం), రెండోది బాసిజ్ మిలీషియా (అంతర్గత విభాగం). ఇరాన్ వెలుపల లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాల్లో సైనిక మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను ఖుద్స్ ఫోర్స్ నిర్వహిస్తుంది. హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలకు మద్దతు ఇవ్వడంలో ఇది కీలకం. దేశంలో తలెత్తే నిరసనలను అణిచివేసేందుకు, విప్లవ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడానికి బాసిజ్ మిలీషియాను ఉపయోగిస్తారు.