ఎల్పీజీ ట్యాంకర్లను హర్మూజ్ దాటించేందుకు.. ఇరాన్‌తో భారత్ చర్చలు..!
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో వంటగ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. వంటగ్యాస్ లభ్యతను పెంచేందుకు భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ ట్యాంకర్ల (LPG Tankers) కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయమీడియా కథనాలు వెల్లడించాయి.
భారత్‌కు పయనమైన 8 ఎల్పీజీ ట్యాంకర్లు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం హర్మూజ్ జలసంధి (Strait Of Hormuz) వద్ద నిలిచిపోయాయి. వీటిని సురక్షితంగా జలసంధిని దాటించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్ (Iran)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు ఇరాన్ అధికారులు సానుకూలంగానే స్పందిస్తున్నారని, త్వరలోనే ఆ ట్యాంకర్లు హర్మూజ్‌ను దాటే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు, ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ జ్వాలల నుంచి రెండు చమురు నౌకలు చాకచక్యంగా బయటపడ్డాయి. ఇందులో ఒకటి బుధవారం భారత్‌కు చేరుకోగా.. మరొకటి రెండ్రోజుల్లో రానుంది. ఈ రెండింటి ద్వారా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది.
ఇదిలాఉండగా.. దేశంలో వంటగ్యాస్ కొరత ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్లు (LPG Cylinders) దొరకట్లేదు. దీంతో హోటళ్లు, రెస్టారంట్లు, హాస్టళ్ల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కేరళలో శుక్రవారం నాటికి 40శాతం రెస్టారంట్లు పనిచేయడం లేదు. ప్రత్యామ్నాయ కుకింగ్‌కు అవకాశం లేకపోవడంతో తాము వ్యాపారం నిలిపివేస్తున్నామని ఆయా రెస్టారంట్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం ప్రకటించినప్పటికీ.. కొన్ని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల బయట ప్రజలు బారులు తీరడం ఆందోళన కలిగిస్తోంది.