త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల: సీఎం చంద్రబాబు
అమరావతి: త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. కలెక్టర్లతో భేటీలో ఆయన మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్టే.. పేదల గురించీ ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పింఛన్, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివి లబ్ధిదారులకు తెలియాలని అన్నారు.
దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. మార్చి 9 నాటికి మహిళలు 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని.. రూ.1,775 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేసిందని వెల్లడించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకుని పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అటవీ శాఖ అధికారులు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని సీఎం చంద్రబాబు సూచించారు. అటవీ శాఖ అధికారుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎంతో మాట్లాడానని.. మరోసారి మాట్లాడతానని తెలిపారు.
‘‘కొందరు అటవీ అధికారుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది’’ అని చంద్రబాబు అన్నారు. (Andhra Pradesh News)