కొణిజర్ల పామాయిల్ ఫ్యాక్టరీ పనులు.. ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొణిజర్ల, వెలుగు : రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలని, ఇందుకు ఆయిల్‌పామ్ సాగు సరైన ప్రత్యామ్నాయం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆయిల్‌పామ్ సాగు చేస్తే ప్రతి ఎకరాకు రూ.51 వేలు సబ్సిడీ వస్తుందని, పంట మార్పిడి ద్వారా రైతాంగానికి సైతం మేలు జరుగుతుందన్నారు.
గోద్రేజ్ కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి సారించిందని, గతంలో ఏపీకే పరిమితమైన ఈ కంపెనీ ప్రస్తుతం ఖమ్మంలో ఫ్యాక్టరీతో పాటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తోందన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ పామాయిల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి కానున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంతరావు, ఆఫీసర్లు ధనసరి పుల్లయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.
వ్యవసాయ పనిముట్ల పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరారవు వ్యవసాయ పనిముట్లు, సాగు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు పాలనలో పట్టు సాధించాలని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
రైతు తనకు నచ్చిన పనిముట్లను నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే సబ్సిడీ నేరుగా రైతుల అకౌంట్లలో పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు హన్మంతరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.