జీహెచ్ఎంసీ వాసులకు గుడ్ న్యూస్..ఆస్తి పన్ను వడ్డీలో 90 శాతం డిస్కౌంట్
గ్రేటర్ వాసులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్తి పన్ను వడ్డీలో 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు.ఆస్తి పన్ను కట్టే వారు OTS స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు కార్పొరేషన్ పరిధిలో 28 లక్షల ఆస్తి పన్నదారుల్లో 18 లక్షల ఆస్తి పన్ను వసూలైందన్నారు. ఇప్పటి వరకు రూ. 2184 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని వెల్లడించారు. మొండి బకాయిదారులను సర్కిల్, జోన్ల వారీగా గుర్తిస్తున్నామని వారందరికీ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు ఆర్వీ కర్ణన్. నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
OTS ద్వారా ఇప్పటివరకు 134 కోట్ల ఆస్తి పన్ను వసూలైందన్నారు జీహెచ్ఎంసీ ఆర్వీ కర్ణన్. మూడు కార్పొరేషన్లలో 28 లక్షల 20 వేల ఆస్తులుండగా వాటిలో 18 లక్షల ఆస్తులకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైందని వెల్లడించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే ఉందన్నారు. పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ అందరూ చెల్లించాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను దశల వారీగా చెల్లిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తిపన్నును ప్రభుత్వంతో బుక్ అడ్జస్ట్ మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఇయర్ 2,766 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాలన్నారు. జీఐఎస్ సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తుల ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్న లక్షా 20 వేల ఆస్తులకు నోటీసులు ఇచ్చామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ ను మై క్యూర్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ ను ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వసూలు చేయాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వసూలు చేయకూడదని చెప్పారు.
ఔటర్ పరిధిలో గతంలో ఎలా ఉందో అలాగే ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు ఆర్వీ కర్ణన్. ఏప్రిల్ 1 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా మారుతుందో ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మూడు కార్పొరేషన్లు కలిసి యాక్టివిటీ చేస్తున్నామని తెలిపారు. వాట్సప్ ద్వారా శానిటేషన్ సమస్యలు కంప్లెయింట్ చేయొచ్చన్నారు ఆర్వీ కర్ణన్.