పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి గుర్తుంచుకోవాలి: చంద్రబాబు
అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు కఠోర దీక్ష చేశారని.. ఆత్మార్పణతో రాష్ట్రాన్ని సాధించి పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘పొట్టి శ్రీరాములు ఎన్నో సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆయన పనిచేశారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించాం. దీని నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రాజధానిలో అమరజీవి విగ్రహం నిర్మాణం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి గుర్తుపెట్టుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.
గత పాలకులు 3 రాజధానుల పేరిట అసలు రాజధానే లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. ‘‘రాజధాని ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి అంటూ ఎన్నో రకాలుగా అసత్యాలు ప్రచారం చేశారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేయాలని ఆలోచించా. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసం జరిగింది.. బ్రాండ్ నష్టపోయింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటు చేశాం. సమస్యలు వచ్చినప్పుడు బాధపడితే నష్టపోతాం.. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే అనుకున్నది సాధిస్తాం. కష్టకాలంలో సమష్టిగా పనిచేయగలిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం ’’అని చంద్రబాబు అన్నారు.
పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటైందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన త్యాగానికి గుర్తుగా జల్‌జీవన్ మిషన్ పనులకు ‘అమరజీవి జలధార’ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.