విజయ్-త్రిషపై రూమర్స్.. అదో పైశాచిక ఆనందం అంటూ ఖుష్బూ ఆగ్రహం
ఇంటర్నెట్ డెస్క్: విజయ్, త్రిషల గురించి కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ (Khushbu) స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా హుందాగా ఉంటుందన్నారు. తెలియని వారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రస్తుతం మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే.. ఎవరైనా తుమ్మినా వాళ్లను నిందించేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. నాకు విజయ్, త్రిష (Trisha) ఇద్దరూ బాగా తెలుసు. ముఖ్యంగా త్రిష నాకు చాలా సన్నిహితురాలు. నాకు తెలిసిన గొప్ప మహిళల్లో తను ఒకరు. ఎంతో మృదుస్వభావి’’ అని చెప్పారు.
ఇక రూమర్స్ సృష్టించేవారు, ఫొటో గ్రాఫర్లను ఉద్దేశించి ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటోగ్రాఫర్లు ప్రతిచోటా సెలబ్రిటీల వెనకపడటం అనేది ముంబయిలో చూస్తుంటాం. ఇప్పుడు ఆ సంస్కృతి ఇక్కడ (చెన్నై) కూడా మొదలవడం బాధాకరం. ఎదుటివారి వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్స్ చేసేవారు.. తమ సమస్యల కంటే ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే ఇష్టపడతారు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతూ వారు ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి కామెంట్స్ చేసేవారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. అలాంటివారు చేసే వ్యాఖ్యలకు స్పందిస్తూ మన విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను’’ అని ఖుష్బూ అన్నారు.
ఇటీవల కూడా ఖుష్బూ వీరిద్దరి గురించి మాట్లాడారు. ‘‘ఈ వ్యవహారంతో ప్రజలకు ఏం సంబంధం ఉందో నాకు అర్థంకావట్లేదు. అది వారి వ్యక్తిగతం. దీనిని ఎందుకు పెద్ద విషయంలా చూస్తున్నారు?’’ అని పేర్కొన్నారు. ఈ కాంట్రవర్సీ విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందా? అని అడగ్గా.. ‘‘ఎవరికి? ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు. అయినా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు’’ అని అన్నారు.