మీ లంచ్ బాక్స్ మీరే తెచ్చుకోండి.. ఉద్యోగులకు షాకిచ్చిన టాప్ ఐటీ కంపెనీలు
పొద్దుపొద్దునే సామాన్యుల ఇళ్లల్లో కుక్కర్ విజిల్స్ హడావిడి.. పిల్లలకు, భర్తకు టిఫిన్, లంచ్ బాక్సులు రెడీ చేస్తూ ఇంట్లో ఆడోళ్ల టెన్షన్ అంతా ఇంతా కాదు.. అదే ఐటీ ఉద్యోగి ఇంట్లో అయితే.. నో సౌండ్స్.. ఆల్ హ్యాపీస్.. పిల్లలకు వంట చేసి టిఫిన్, లంచ్ బాక్స్ ప్యా్క్ చేస్తే సరిపోతుంది.. భర్త ఎటూ ఆఫీసులోనే టిఫిన్, లంచ్ చేస్తాడు కదా.. డోంట్ వర్రీ.. బీ హ్యాపీగా సాగాయి ఐటీ ఉద్యోగుల ఇళ్లల్లో.. ఇదంతా గతం.
ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఇళ్లు కూడా సామాన్యుల మాదిరిగానే గందరగోళం.. హడావిడి నడుస్తుంది.. నిన్నటి వరకు లంచ్ బాక్స్ ఏంటో తెలియదు.. నిన్నటి వరకు సద్ది డబ్బా అంటే ఏంటో తెలియదు.. నిన్నటి వరకు క్యారేజ్ తీసుకెళ్లటం అంటే ఏంటో తెలియదు.. ఇప్పుడు సీన్ మారిపోయింది.. అందరిలా లంచ్ బాక్సులు పెట్టుకుంటున్నారు.. హడావిడిగా ఇంట్లో టిఫిన్ చేస్తున్నారు.. ఏంటి బాసూ కొత్తగా మనకీ ఖర్మ అంటూ లోలోపల మదనపడుతున్నారు ఐటీ ఉద్యోగులు. టాప్ ఐటీ కంపెనీలు మొత్తం ఉద్యోగులకు తేల్చిచెప్పేశాయి.. మీ లంచ్ బాక్సు మీరే తెచ్చుకోండి అని.. రేపు గ్యాస్ సప్లయ్ వచ్చినా.. ఈ విధానంలో మార్పు వచ్చే పరిస్థితులు కూడా కనిపించటం లేదనేది ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో వినిపిస్తున్న మాట..
కమర్షియల్ సిలిండర్ల కొరత ఐటీ ఉద్యోగుల నోటి కాడ కూడు తీసేసింది. ఇకపై.. ఉద్యోగులకు ఫుడ్ పెట్టలేమని ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు తేల్చి చెప్పేశాయి. ఇక.. ఎవరి ఇంటి నుంచి వాళ్లు లంచ్ బాక్సులు తెచ్చుకోవాలని ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్ కంపెనీలు ఉద్యోగులకు స్పష్టం చేశాయి. ఐటీ కంపెనీల క్యాంటీన్స్లో ఇకపై కొన్నాళ్ల వరకూ టీ, కాఫీలు మాత్రమే దొరికే పరిస్థితి ఉంది. పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్.. ఇలా ప్రధాన నగరాల్లోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మీల్స్ ప్రొవైడ్ చేయలేమని నిర్మొహమాటంగా చెప్పేశాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్ క్యాంపస్‌ల్లో ఇదే పరిస్థితి ఉంది. పుణెలోని యరవాడలోని కామర్స్ జోన్‌లో.. మార్చి 9 నుంచే ఉద్యోగులు ఇంట్లో వండుకున్న ఫుడ్ తెచ్చుకోవాలని టీసీఎస్ చెప్పేసింది. బెంగళూరులోని ఐటీపీఎల్ వైట్‌ఫీల్డ్ క్యాంపస్ కూడా.. మార్చి 11 నుంచి సిబ్బందిని లంచ్ ప్యాక్ చేసుకుని తెచ్చుకోవాలని సూచించింది. లేదు మేం తెచ్చుకోమంటే.. లెమన్ రైస్, శాండ్‌విచ్‌లు మాత్రమే ప్రొవైడ్ చేస్తామని బెంగళూరు టీసీఎస్ క్యాంపస్ ఉద్యోగులకు స్పష్టం చేసింది. కాగ్నిజెంట్ కూడా పుణె క్యాంపస్‌లో ఫుడ్ కౌంటర్లను మూసివేసింది.