మా 22 ఏళ్ల కష్టాన్ని క్షణంలో కూల్చేశారు : ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలిన అపార్ట్మెంట్..!
నేను 22 ఏళ్లు కష్టపడ్డాను.. నా భార్య 20 ఏళ్లు కష్ట పడింది. రూపాయి రూపాయి కష్టపడి సంపాదించాం. సొంత ఇల్లు కొనుక్కున్నాం.. పదేళ్లుగా అక్కడే ఉంటున్నాం.. సంపాదించిన ప్రతి రూపాయిని భద్రంగా దాచుకుని మరీ ఈ అపార్ట్ మెంట్ లో సొంతింటిని ఏర్పాటు చేసుకున్నాం.. మా కుటుంబం 22 ఏళ్ల కష్టాన్ని క్షణంలో కూల్చేశారు.. కుప్పకూల్చారు.. నడిరోడ్డుపైకి తీసుకొచ్చారు.. ఇప్పుడు మేం ఎక్కడ ఉండాలి.. ఎవరి ఇంటికి వెళ్లాలి.. ఎలా బతకాలి.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో కుప్పకూలిన అపార్ట్ మెంట్ లోని ఇంటి బాధితుడు.
ఇతని పేరు బిలాల్ ఆర్.కాఫరాని. బీరూట్ సిటీలోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. రసాయన శాస్త్రం చెప్పే ప్రొఫైసర్.. అతని భార్య కూడా టీచర్. వీళ్లిద్దరూ కలిసి 22 ఏళ్లు కష్టపడి.. బీరూట్ సిటీలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేశారు.
2026 మార్చి 18వ తేదీ ఉదయం.. యుద్ధంలో భాగంగా బీరూట్ సిటీపై ఇజ్రాయెల్ మిస్సైల్స్ తో విరుచుకుపడింది. సిటీపైనే విచ్చలవిడిగా బాంబులు వేసింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ మిస్సైల్ బాంబ్.. సరిగ్గా బిలాల్ ఆర్.కాఫరానీ అపార్ట్ మెంట్ ను తాకింది. అది కూడా కింది భాగంలోని అపార్ట్ మెంట్ పిల్లర్లను ఢీకొట్టి.. పేలిపోయింది మిస్సైల్. ఈ దాడిలో అపార్ట్ మెంట్ క్షణాల్లోనూ.. రెప్పపాటులో కుప్పకూలిపోయింది.
ఈ వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు బిలాల్. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విద్య, ఆరోగ్యం, సామాజిక కోణంలో మాత్రమే పోస్టులు పెడుతూ వచ్చాను.. ఫస్ట్ టైం యుద్ధం వినాశనం ఎలా ఉందో చూపిస్తున్నాను. నేను సర్వస్వం కోల్పోయాను.. నా కలల ఇల్లు కుప్పకూలిపోయింది అంటూ బిలాల్ పోస్ట్ చేసి వీడియో వైరల్ అయ్యింది. బీరూట్ సిటీలో ఇజ్రాయెల్ దాడులు ఏ విధంగా ఉన్నాయి.. అక్కడ జరుగుతున్న విధ్వంసం ఎలా ఉంది అనటానికి ఈ పోస్టు నిదర్శనం.. సాక్ష్యం అంటున్నారు నెటిజన్లు.