అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth On Jamili Elections: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టి చర్చల్లో రాష్ట్ర రాజకీయాలు, జమిలి ఎన్నికలు, మోయినాబాద్ డ్రగ్స్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2028లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయన మాత్రం జరగబోవని చెబుతున్నారు.
ఆరు నెలల ఆలస్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
2028లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావని, 2029లో దేశవ్యాప్తంగా జరిగే జమిలి ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ఆయన వివరించారు. దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కాకుండా మరో ఆరు నెలలు అధికంగా అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్లకు సిద్ధం
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపైనా మాట్లాడారు. ఈ చట్టం ముందే అమల్లోకి వస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాగతిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు ముందే వస్తే సంతోషమే, మేము అందుకు సిద్ధంగా ఉన్నాము అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ప్రమేయం లేదు
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ దాడిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ కేసులో టీడీపి ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడటం, ఆయనకు స్టేషన్ బెయిల్ లభించడం వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చింది పోలీసులు మాత్రమే, ఇందులో రాజకీయ జోక్యం లేదు అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును అత్యంత పారదర్శకంగా, త్వరితగతిన విచారించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు సిట్ తన విచారణను కొనసాగిస్తోందని, నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సిట్ తన పని తాను చేసుకుంటుంది, ఇందులో మేము చేసేది ఏమీ లేదు అని చెబుతూనే, రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.