కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి: పేలిపోయిన ఆయిల్ ట్యాంకులు
యుద్ధానికి బ్రేక్ పడింది.. అమెరికా డిమాండ్లు పెట్టింది.. ఇరాన్ దేశంతో చర్చలు జరుపుతున్నది.. ఇలాంటి వార్తల మధ్య బిగ్ బ్రేకింగ్. యుద్ధం భీకరంగానే సాగుతున్నది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది.. ఇరాన్ రివర్స్ ఎటాక్ చేస్తూనే ఉంది. అమెరికా అయితే బ్రేక్ ఇచ్చింది కానీ.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆగటం లేదు. 2026, మార్చి 25వ తేదీ ఉదయం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ బాంబులు వేసింది. ఎయిర్ పోర్టులోని ఆయిల్ ట్యాంకులు పేలిపోయాయి. ఇరాన్ బాంబు దాడులతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేసింది అక్కడి ప్రభుత్వం. ఈ లేటెస్ట్ దాడులపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్‌పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం (మార్చి 24) రాత్రి కువైట్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. కువైట్ ఎయిర్ పోర్టే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
ఇరాన్ డ్రోన్లు ఎయిర్ పోర్టులోని ఆయిల్ ట్యాంకర్లను ఢీకొట్టడంతో అగ్నిపర్వతం బద్దలైన మాదిరిగా ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడులను కువైట్ ధృవీకరించింది. ఈ దాడి వల్ల పరిమిత నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. శత్రు క్షిపణి, డ్రోన్ దాడులను తమ దేశ ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటుందని కువైట్ ప్రభుత్వం తెలిపింది. తమ బలగాలు ఆరు డ్రోన్‌లను అడ్డుకున్నాయని కువైట్ నేషనల్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
2026, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా యూఎస్‌కు మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ అటాక్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ అనేక సార్లు దాడులకు పాల్పడింది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ విమానాశ్రయం వాణిజ్య విమానాలకు క్లోజ్ చేశారు. 2026, మార్చి 14న కూడా కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి చేసి కమ్యూనికేషన్ సిస్టమ్‌ను దెబ్బ తీసింది ఇరాన్. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి అదే ఎయిర్ పోర్టుపై అటాక్స్ చేసింది.