నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు
ఖాఠ్మాండు: భారత పొరుగు దేశం నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయ్యింది. గురువారం (మార్చి 26) సుదూరపశ్చిమ్ ప్రావిన్స్‌లోని దార్చులా జిల్లా మురై ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం వెల్లడించింది.
ఈ భూ ప్రకంపనల ప్రభావం పక్కనే ఉన్న బైతాడి, బఝాంగ్ జిల్లాల్లో కూడా కనిపించిందని తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం యంత్రాగం సహయక చర్యలు చేపట్టింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
నేపాల్ భూకంపాలు ఎక్కువగా సంభవించే టెక్టోనిక్ జోన్‌లలో (భూకంప జోన్‌లు IV, V) ఉంది. దీంతో ఈ హిమాలయ దేశంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలో అత్యంత భూకంప ముప్పు ఉన్న దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది. 2015లో నేపాల్‌లో సంభవించిన ఒక వినాశకరమైన భూకంపం దాదాపు 9 వేల మంది ప్రాణాలను బలిగొంది. 7.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప ధాటికి 22 వేల మందికి పైగా గాయపడగా.. 28 లక్షల మందిని నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు, పాఠశాలలు, రోడ్లు, శతాబ్దాల నాటి వారసత్వ ప్రదేశాలు శిథిలాల కుప్పగా మారాయి.