వేయి స్తంభాల గుడికి కొత్త మెరుగులు.. అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి రూ.14.44 కోట్లు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులోని హనుమకొండ వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరుడి ఆలయంలో కాకతీయ కళావైభవం మరింత మెరువనుంది. ఆలయ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్ల 44 లక్షల నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితమే కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించే కల్యాణ మండపాన్ని పునర్నిర్మించగా, అప్పటి నుంచి భక్తుల రద్దీ పెరిగింది. అయితే ప్రధాన ఆలయం, కల్యాణ మండపం తప్పితే మిగతా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో ఇప్పుడు కేంద్ర టూరిజం శాఖ నిధులతో అక్కడ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఆలయం ముందు ఇరువైపులా ఉన్న కొన్ని ఇండ్లను తొలగించి సుమారు రెండు ఎకరాల స్థలాన్ని విస్తరణకు వినియోగించాలనే యోచన కూడా ఉంది.
హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి సుమారు 863 ఏండ్ల చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో మొదటి రుద్రుడు 1163లో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నిదర్శనం. సుమారు 1400 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే ప్రాంగణంలో పూజలందుకుంటారు. అందుకే దీనిని త్రికూటాలయంగా కూడా పిలుస్తారు. ఆలయంలోని ప్రతి రాయి సంగీతాన్ని పలికించేలా చెక్కబడింది.
సప్తస్వరాలను శిలల్లో ప్రతిధ్వనింపజేసిన ఘనత అప్పటి శిల్పులకు దక్కింది. ఆధునిక యంత్రాలు లేకుండానే ఈ నిర్మాణం శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలిచింది. తుగ్లక్ సేనల దాడులు జరిగినప్పటికీ నిర్మాణం దెబ్బతినలేదు. డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలతో ఈ ఆలయ నిర్మాణం సాగింది. భారీ వర్షాల కారణంగా కొన్నేళ్ల క్రితం కల్యాణ మండపంలోని కొన్ని స్తంభాలు కుంగినా శిల్ప సంపద మాత్రం నిలకడగా ఉంది.
వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం పర్యాటకులను ఆకర్షించే ముఖ్య కట్టడం. వరదలు, వర్షాల కారణంగా కొంత భాగం దెబ్బతినడంతో 2006లో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రూ.7.5 కోట్లతో పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు ఈ పనులు చేపట్టారు. అయితే ఆ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆలస్యమైంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇది పూర్తికాలేదు. అనంతరం కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి 2022లో ఆలయాన్ని సందర్శించి మరో రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం 2024 మార్చిలో కల్యాణ మండపాన్ని ఆయన చేతుల మీదుగా పునఃప్రారంభించారు.
నంది మండపం, బ్యూటిఫికేషన్ పనులు..
కల్యాణ మండపం ప్రారంభమైన తర్వాత భక్తులు, పర్యాటకుల రాక పెరిగింది. కానీ ఆలయం చుట్టూ ప్రాంగణం ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు చేయాల్సి వచ్చింది. స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంతో రూ.14 కోట్ల 44 లక్షల నిధులు మంజూరయ్యాయి.