దమ్ముంటే పాలమూరు పూర్తిచెయ్
వనపర్తి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా మోసమే జరుగుతున్నదని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 9 ఏండ్లలోనే ఉమ్మడి పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 65 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేలా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి గ్రామాల రైతులు 102 రోజుల నుంచి రిజర్వాయర్ వద్ద అని చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్ ఇసాక్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ నేతలతో కలిసి నిర్వాసితులను పరామర్శించారు.
వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ సభనుద్దేశించి హరీశ్ మాట్లాడారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి 900 రోజులు గడిచినా హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
‘ఇంట్లో ఈగల మోత అన్నట్టు తెలంగాణలో పరిస్థితి ఉంటే.. మన సీఎం మాత్రం కేరళ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నాడు’ అని ధ్వజమెత్తారు. ఇక్కడ కాంగ్రెస్ అన్ని పథకాలూ అమలు చేసిందని నోటికొచ్చినట్టు వాగుతుండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తరచూ పాలమూరు.. నల్లమల పులిబిడ్డనని రేవంత్ ప్రగల్భాలు పలుకుతాడని, ఆయన పులిబిడ్డ కాదు.. పిల్లి అని దెప్పిపొడిచారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టులో కూడా తట్టెడు మట్టి ఎత్తలేదని ఎద్దేవాచేశారు.
రూ.4 వేల కోట్లు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని గుర్తుచేశారు.
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా రేవంత్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నడు? ఇప్పటికైనా దమ్మూధైర్యం ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి’ అని సవాల్ విసిరారు. ఎత్తిపోతల పథకాన్ని జూరాల ఆధారిత నీటితో ఏర్పాటు చేయాలని అర్థం పర్థంలేకుండా కాంగ్రెస్ నాయకులు వాగుతున్నారని, ప్రస్తుతం జూరాల పరిధిలో ఉన్న భీమా ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు జూరాల ఆధారిత నీటితో పాలమూరు ప్రాజెక్టు నిర్మించి ఉంటే మళ్లీ పాలమూరు ఎడారిగా మారే ప్రమాదం ఉండేదని చెప్పారు. శ్రీశైలాన్ని ఆంధ్రాకు అప్పగించాలన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఆడుతున్న జగన్నాటకమిదని మండిపడ్డారు. గొల్లపల్లి, చీర్కపల్లి రైతులకు అండగా ఉంటామని, మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని భరోసా ఇచ్చారు.