హెడ్గేవార్ స్మృతి మందిర్ రెడీ.. ఇయ్యాల ప్రారంభించనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది వేడుకల చిహ్నంగా సంఘ్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నిర్మిస్తున్న స్మృతి మందిరం ఇయ్యాల ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కందకుర్తిలోనే పుట్టిన కేశవరావ్ భళిరామ్ హెడ్గేవార్ 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు.
సొంతూరిలోని కేవశరావ్ ఇంటిని ఇన్నాళ్లూ స్మృతి మందిరంగా కొనసాగించిన ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వందేండ్ల సంబరాల నేపథ్యంలో... ఆ ఇంటిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. దీంతో పాత ఇంటిలో కొనసాగుతున్న కేశవ స్మృతి మందిరాన్ని కూల్చేసి ఆర్‌ఎస్‌ఎస్ సొంత ఖర్చుతో సుమారు అర ఎకరం విస్తీర్ణంలో రెండు అంతస్తులతో బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదటి అంతస్తులో హెడ్గేవార్ జీవిత చరిత్రను తెలిపే ఫొటోలు, భారతమాత విగ్రహం ఏర్పాటు చేస్తుండగా.. మొదటి అంతస్తులో హెడ్గేవార్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సంవత్సరం కింద మొదలైన పనులు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. స్మృతి మందిరం పక్కనే కేశవ సమితి పాఠశాల, యూత్స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, మహిళలకు స్వయం ఉపాధి ట్రైనింగ్, సేంద్రీయ సాగుపై రైతులకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.