ట్రేడ్ డీల్‌కు ముందు.. అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి భేటీ
వాషింగ్టన్: భారత్-అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో.. అగ్రరాజ్యానికి భారత రాయబారి అయిన వినయ్ మోహన్ క్వాత్రా తాజాగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) సంబంధించిన అంశాలపై వీరివురూ చర్చలు జరిపారు. ఈ విషయాన్ని క్వాత్రా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ద్వైపాక్షిక సహకారంపై ఇరుదేశాలకు ఉన్న అవకాశాలపై మేం చర్చించాం. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాల పైనా మాట్లాడుకున్నాం’’ అని భారత రాయబారి వెల్లడించారు.
ఈ భేటీలో అమెరికా మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఓబ్రెయిన్ కూడా పాల్గొన్నారు. ట్రేడ్ డీల్ (Trade Deal) కోసం భారత బృందం వచ్చేవారం వాషింగ్టన్‌కు వెళ్లనున్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, గత నెలలో భారత్‌పై సెక్షన్ 301 కింద అమెరికా ప్రారంభించిన దర్యాప్తును విరమించుకునే అంశం పైనా వీరు చర్చించినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధంతో భారత ఎగుమతులు డీలా భారత్-అమెరికా ఫిబ్రవరిలో విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం, భారత్‌పై టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడానికి అంగీకారం కుదిరింది. అయితే ట్రంప్ విధించిన ఈ ప్రతీకార టారిఫ్‌లు చెల్లవంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో టారిఫ్ పరంగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ మార్పులపై చర్చలు జరిపి, తదుపరి కార్యాచరణను చేపట్టేందుకు భారత్, అమెరికా ముఖ్య సంధానకర్తలు ఏప్రిల్ 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో చర్చలు జరపనున్నారు. ఇదిలాఉండగా.. భారత్‌పై ప్రకటించిన సెక్షన్ 301 దర్యాప్తును విరమించుకోవాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అమెరికా తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ‘సహేతుకం కాని విదేశీ ధోరణుల’ను అవలంబిస్తున్నాయా? అనే కోణంలో భారత్ సహా 15 దేశాలపై అగ్రరాజ్యం ఈ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయా దేశాలు అసమంజస వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నాయని తేలితే వాటిపై టారిఫ్‌లు, జరిమానాలు విధించనున్నట్లు అమెరికా గతంలో వెల్లడించింది.