సౌదీ ఇచ్చింది.. యూఏఈ చెల్లించమంటోంది: పాక్ పరిస్థితి
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ (Pakistan) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సౌదీ అరేబియా నుంచి 2 బిలియన్ డాలర్లు వచ్చాయన్న ఆనందం కన్నా.. యూఏఈకి ఈ నెలలో అప్పు తిరిగి తీర్చాలన్న ఆలోచన దానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాని విదేశీ మారక నిల్వలు కూడా క్షీణిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌కు 3 బిలియన్ డాలర్లు ఆర్థికసాయం చేసేందుకు సౌదీ (Saudi Arabia) ముందుకొచ్చింది. అందులోభాగంగా సౌదీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆ దేశానికి తాజాగా 2 బిలియన్ డాలర్లు అందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
మరోవైపు.. పశ్చిమాసియా సంక్షోభంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్‌కు యూఏఈ (UAE) షాకిచ్చింది. గతంలో ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.32 వేల కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరింది. ఇప్పటివరకు యూఏఈ వద్ద తాము అప్పుగా తీసుకొన్న డబ్బు తిరిగి చెల్లిస్తామని పాక్ వెల్లడించింది. మార్చి 27 నాటికి పాక్ వద్ద 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. తాజాగా సౌదీ నుంచి వచ్చిన ఆర్థిక సాయంతో.. ఈ నెలాఖరులోగా యూఏఈకి చెల్లించాల్సిన మొత్తాన్ని దాయాది దేశం తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. బుధవారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలిసి.. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.