Select Location
All Locations
State
Region
City / District
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు

రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంజిమిన్‌ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్‌పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. 

రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్‌ అలీ రిడా అబ్బాస్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్‌ జెబీల్‌ పట్టణానికి హెజ్‌బొల్లా కమాండర్‌గా అబ్బాస్‌ ఉన్నట్లు పేర్కొంది. 

ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్‌ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్‌ పేర్కొన్నారు. మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్‌ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్‌ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు.

లేకపోతే ఆ దేశంలో విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. చర్చలు లేవన్న ఇరాన్‌.. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.


Sakshi 1 hour ago
Home Flash News