Select Location
All Locations
State
Region
City / District
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం

తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది.

సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి... సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. 

ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్‌ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేత బీఆర్‌ఎస్‌లో చేరిక ఆ పార్టీకి మోరల్‌ బూస్ట్, కాంగ్రెస్‌కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులు తెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్‌.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. 

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్‌ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్‌ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్‌ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. 

ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్‌ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా. ఆసక్తికరంగా సీఎం పర్యటన ఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్‌ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్‌ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్‌ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. 

మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్‌ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్‌ఎస్‌పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది.


Sakshi 1 hour ago
Home Flash News