హత్యలు వీళ్లే చేయిస్తారు.. పరామర్శ వీళ్లే చేస్తారు: మంత్రి పార్థసారథి
అమరావతి: ప్రజల దృష్టి మళ్లించేందుకు వైకాపా నేతలు ఎన్ని నాటకాలైనా ఆడుతారని మంత్రి పార్థసారథి విమర్శించారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూశామన్నారు. కడప జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ‘‘2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఎలా తెగబడిందో చూశాం. హత్యలు వీళ్లే చేయిస్తారు.. పరామర్శ వీళ్లే చేస్తారు.
ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించేలా కారణాలు వెతుకుతారు. పెద్ద దస్తగిరి ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు అతడు. తాడేపల్లి పెద్దలకు కూడా చాలా సన్నిహితుడు. పులివెందులలో జరిగే రహస్య మంతనాల్లో దస్తగిరి ఉంటాడని కడపలో అందరూ చెబుతారు. చీకట్లో చంపేసి.. పొద్దున్నే వెళ్లి పరామర్శ నాటాకాలాడుతున్నారు’’ అని మంత్రి ఆరోపించారు.