వార్ ఎఫెక్ట్: భారత్‌లో 1/4 వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి
Fertiliser production | దిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడింది. దేశీయంగా ఎరువుల ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. మార్చి నెలలో దేశీయంగా వీటి ఉత్పత్తి దాదాపు నాలుగో వంతు తగ్గిపోయిందని కేంద్రం వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి సహజ వాయువు దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఆ మేర ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడి అనంతరం హర్మూజ్ జల సంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. యూరియా వంటి ఎరువుల తయారీకి సహజ వాయువు కీలకం. దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఎరువుల తయారీ 24.6 శాతం తగ్గినట్టు కేంద్రం సోమవారం వెల్లడించింది. అయితే ఎరువులు తగిన స్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 3.4 శాతం, జనవరిలో 3.7 శాతం, డిసెంబర్‌లో 4.1 శాతం ఉత్పత్తి పెరగడం గమనార్హం.
సాధారణంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూన్-జులై నెలల్లో దేశీయంగా ఎరువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రబీ సీజన్‌కు సంబంధించి అక్టోబర్- నవంబర్‌లో మళ్లీ డిమాండ్ ఉంటుంది. ఎరువులను దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు యూరియా, ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ ప్రభావం రైతులపై పడకుండా సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం 11 శాతం ఇటీవల పెంచింది.