ట్రంప్ మాటను లెక్కచేయని ఇరాన్.. హార్మూజ్‌లో వాణిజ్య నౌకపై కాల్పులు
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా-ఇరాన్ చర్చలు కొలిక్కి వచ్చే వరకు కాల్పులు విరమణ ఒప్పందం పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులకు పాల్పడింది. ఓ కంటైనర్ షిప్‌పై ఇరాన్ దళాలు విరుచుకుపడ్డాయి.
ఇరాన్‌కు చెందిన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం 7:55 గంటల ప్రాంతంలో హార్మూజ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై దాడి చేసిందని బ్రిటీష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) నివేదించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. సీజ్ ఫైర్ పొడగిస్తున్నట్లు తాను ప్రకటించిన గంటల వ్యవధిలోనే హార్మూజ్‌లో ఇరాన్ కాల్పులకు పాల్పడటంపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో.
అమెరికా--ఇరాన్ మధ్య రెండో దశ చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యవర్తి పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పూర్తి అయ్యే వరకు సీజ్ ఫైర్ కొనసాగుతుందని తెలిపారు. అయితే, హార్మూజ్ జలసంధిలో అమెరికా నావల్ బ్లాకేడ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.