భారత్‌ను నరకంతో పోల్చిన లెటర్‌ను షేర్ చేసిన ట్రంప్
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మరోసారి అనుచిత వైఖరి ప్రదర్శించారు. భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేశారు . జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) అంశాన్ని ప్రస్తావిస్తూ మైఖెల్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆసియా దేశాల నుంచి మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారు. ఇక్కడ ఉన్న చట్టాలమో ఆ బిడ్డకు వెంటనే అమెరికా సిటిజన్‌షిప్ ఇస్తాయి.
ఆ తర్వాత వారు తమ కుటుంబసభ్యులందరినీ చైనా, భారత్ లేదా మరేదైనా నరకం నుంచి ఇక్కడికి తీసుకొస్తారు’’ అంటూ అనుచితంగా ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇలా అమెరికా పౌరసత్వం లేనివారికి జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ రావడాన్ని మైఖెల్ వ్యతిరేకించారు. ఈ అంశాన్ని కోర్టులకు వదిలేయకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖనే ట్రంప్ రీపోస్టు చేశారు. ‘అమెరికాను వీడి వెళ్లిపోదాం ఇక’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన..!
ప్రపంచంలో ఏ దేశమూ అమెరికా దేశంలా జన్మతః పౌరసత్వాన్ని కల్పించడం లేదని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే అందులో వాస్తవం లేదు. 30కి పైగా దేశాలు ఈ హక్కును కల్పిస్తున్నాయి. కెనడా, మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాలు ఈ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. ట్రంప్ గతంలో భారత్‌ను డెడ్ ఎకనామీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ ప్రధాని మోదీ (PM Modi) పరోక్షంగా కౌంటర్ ఇస్తూ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందన్నారు.