ఉత్తరాంధ్ర సిగలో మరో భారీ ప్రాజెక్టు.. క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన
రాంబిల్లి: అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతోందని, దేశంలోనే నంబర్ వన్ జిల్లాగా తయారవుతుందని తెలిపారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇటీవలే రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. ‘‘క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అత్యంత వెనుకబడిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలో ధనిక జిల్లాగా మారింది. ఇప్పటికే విశాఖలో పూర్తిగా పరిశ్రమలు వచ్చాయి. ఇకపై ఏ పెట్టుబడులు వచ్చినా అనకాపల్లి జిల్లాకే వస్తాయి. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత నాది.
రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాంబిల్లిలోని సోలార్ ఇన్‌ఘాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపై ఆధారపడే పరిస్థితి పోతుంది. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కలల సాకారానికి ఇదే నిదర్శనం. 2000లోనే విద్యుత్ రంగ సంస్కరణలు మొదలుపెట్టాం. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగం కుప్పకూలింది. ఉచిత సోలార్ కరెంటు వాడకుండా రూ.9వేల కోట్లు చెల్లించారు. విద్యుత్ సంస్థలపై రూ.1.12 లక్షల కోట్లు భారం మోపారు. విద్యుత్ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచి ప్రజలపై రూ.32వేల కోట్ల భారం మోపారు. కేంద్రం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా సాగుతుంటే.. ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది.
గ్రీన్ ఎనర్జీ వల్ల రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయి. 22 నెలల వ్యవధిలో 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 4.76 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే 160 గిగావాట్లలో 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారీకి అనుమతులు మంజూరు చేశాం. గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతోంది. వచ్చే ఏడాది ఈ పనులు కూడా ప్రారంభమవుతాయి.త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. వెయ్యికిపైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. త్వరలో మరో 444 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. మూడేళ్లలో 5 వేలకుపైగా ఛార్జింగ్ స్టేషన్లు వస్తాయి.