అనవసరంగా నన్ను వివాదంలోకి లాగారు: నరవణె
ఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’(Four Stars of Destiny) పుస్తకంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. దీనిపై నరవణె తాజాగా స్పందించారు. తన పుస్తకం ఇంకా పబ్లిష్ కాకపోయినా, అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగారంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరవణె రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. నరవణె(Manoj Naravane) రచించిన మరో పుస్తకం ‘ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్‌ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్’ ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలోనే ఆయన పీటీఐతో మాట్లాడుతూ..
‘‘ఈ మధ్య జరిగిన నా పుస్తకం వివాదం తర్వాత రెండు పుస్తకాలు రాశాను. వాటిల్లో ఒకటి విడుదలైంది. మరోటి త్వరలో రానుంది. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని పూర్తిగా పరిశీలించేవరకు ప్రచురణను నిలిపివేయమని రక్షణ మంత్రిత్వశాఖ కోరింది. ఆ విషయం అక్కడితో ముగిసింది. నేను ముందుకెళ్లాను.. నా వరకు అది ముగిసిపోయిన అధ్యాయం. కానీ ప్రచురితం కాని పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కొందరు దానిపై తీవ్ర చర్చలు చేశారు. దీనివల్ల పుస్తకంతో పాటు నన్నూ ఈ వివాదంలోకి లాగినట్టే కదా. అది ఏమాత్రం సమంజసం కాదు’’ అని రాహుల్‌గాంధీని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ నరవణె రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. అయినప్పటికీ అప్పట్లో దీన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభకు తీసుకువెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పుస్తకాన్ని ప్రధానికి అందిస్తానంటూ రాహుల్ పేర్కొన్నారు.