ఈసారైనా ట్రంప్‌ను నోబెల్ వరిస్తుందా..? మరోసారి మొదలైన చర్చ
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నోబెల్ శాంతి బహుమతి- 2026’ (Nobel Peace Prize- 2026)కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అందరి దృష్టి పడింది. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా.. అందులో ట్రంప్ (Donald Trump) పేరు కూడా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఈసారైనా ట్రంప్‌ను శాంతి బహుమతి వరిస్తుందా అనే చర్చ మొదలయ్యింది. 208 మంది వ్యక్తులు, 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు గురువారం నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇందులో ట్రంప్ పేరు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఆయనతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ వంటి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. నామినేషన్లకు సంబంధించిన పేర్లను కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. కాబట్టి.. ఈ పేర్లకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదు. గల్ఫ్‌లో కొత్త ఆట ఇరాన్ యుద్ధం వేళ.. శాంతి వరిస్తుందా? ఎనిమిది యుద్ధాలు ఆపానని ప్రకటించుకుంటూ.. నోబెల్ శాంతి బహుమతిపై గతేడాది ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇజ్రాయెల్, రష్యా, పాకిస్థాన్ సహా పలు దేశాలు, అనేకమంది వ్యక్తులు ఆయన పేరును ప్రతిపాదించారు.
చివరికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు అది దక్కడంతో ట్రంప్‌నకు నిరాశ తప్పలేదు. తాజాగా వచ్చిన నామినేషన్లలో కూడా ట్రంప్ పేరున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ట్రంప్ భీకర యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కలలు కంటున్న శాంతి బహుమతి ఆయన్ను వరిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా.. 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబరు 9న ప్రకటిస్తారు. డిసెంబరు 10న ఓస్లాలో దీన్ని ప్రదానం చేయనున్నారు. ఈ నామినేషన్ల సమర్పణ గడువు జనవరి 31నే ముగిసింది.