Select Location
All Locations
State
Region
City / District
అస్సలు పట్టించుకోను.. వారితో​ నాకేంటి: రియాన్‌ పరాగ్‌

అస్సలు పట్టించుకోను.. వారితో​ నాకేంటి: రియాన్‌ పరాగ్‌

ఐపీఎల్‌-2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నాలుగో ఓట‌మి చ‌విచూసింది. శుక్ర‌వారం జైపూర్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఆ జట్టు కీలక బౌలర్లు జోఫ్రా ఆర్చర్‌, బర్గర్ పూర్తిగా తేలిపోయారు.

ఫలితంగా ఈ భారీ టార్గెట్‌ను ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఢిల్లీ విజయంలో కేఎల్ రాహుల్‌(75), ఫాథుమ్ నిస్సాంక(62) కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ప్ర‌త్య‌ర్ధి ముందు భారీ టార్గెట్ ఉంచిన‌ప్ప‌ట‌కి విజ‌యం సాధించ‌లేక‌పోయామ‌ని ప‌రాగ్ అన్నాడు.

కొన్ని ఓవ‌ర్ల‌లో వ‌రుస‌గా బౌండ‌రీలు ఇవ్వ‌డం వ‌ల్ల మ్యాచ్‌పై ప‌ట్టు కోల్పోయాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని స‌రైన నిర్ణ‌య‌మే తీసుకున్నాం. కానీ బౌలింగ్‌లో మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమలు చేయ‌లేక‌పోయాం. ఇక లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే డోనోవ‌న్ ఫెరీరా కంటే ముందు జ‌డేజాను బ్యాటింగ్‌కు పంపాము. అప్పటికి ఇంకా 8-9 ఓవర్లు ఉన్నాయి.

స్పిన్నర్ల బౌలింగ్‌లో ఓవర్‌కు 8 లేదా 9 పరుగులు తీస్తూ, తర్వాత ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి హిట్టింగ్ చేయాలని ప్లాన్ చేశాం. అందుకే అత‌డి బ్యాటింగ్‌ను కొంచెం ఆలస్యం చేశాం. నా హ్యామ్‌స్ట్రింగ్‌(తొడ వెన‌క భాగం)లో చిన్న నొప్పి ఉంది. ఇది మ‌రీ అంత సీరియ‌స్ కాదు. మా త‌దుప‌రి మ్యాచ్‌కు వారం రోజుల విశ్రాంతి ల‌భించింది. ఈ స‌మ‌యంలో కోలుకుంటున్నాని ఆశిస్తున్నా.

నా ఫామ్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జ‌ట్టుకు రెండు పాయింట్లు అందించ‌డమే నా ల‌క్ష్యం. జట్టు ఓడిపోతే నా వ్యక్తిగత స్కోరుకు లేదా ఇన్నింగ్స్‌కు ఎలాంటి విలువ ఉండదు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో ప‌రాగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ప‌రాగ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి తృటిలో తన తొలి ఐపీఎల్ సెంచరీని కోల్పోయాడు.


Sakshi 1 hour ago
Home Flash News