సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా : పార్టీ పగ్గాలు కొడుకు ఉదయనిదికే..!
తమిళనాడు సీఎం పదవికి రాజీనామా చేశారు స్టాలిన్. ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓడిపోయింది. రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తూ.. తన లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు పంపించారు. సోమవారం రాత్రే తన లేఖను.. పార్టీకి చెందిన ముఖ్య నేతల ద్వారా గవర్నర్ ఆఫీసుకు పంపించారు. మే 5వ తేదీ మంగళవారం ఉదయం.. స్టాలిన్ రాజీనామాను ఆమోదించారు గవర్నర్. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు.. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని సూచించారు గవర్నర్. తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సీఎం.. ముఖ్యమంత్రి అనే పదాన్ని తొలగించారాయన.
DMK పార్టీ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది.. మేం అధికార పార్టీగా ఉంటే ప్రజల కోసం పథకాలు రూపొందిస్తాం.. ప్రతిపక్ష పార్టీగా ఉంటే ప్రజల డిమాండ్ల కోసం పోరాడతాం. ఆ దిశగా ఇప్పుడు బలమైన ప్రతిపక్ష పార్టాగా ప్రజల కోసం రాజకీయాలను కొనసాగిస్తాం అంటూ Xలో కామెంట్ చేశారు స్టాలిన్. డీఎంకే పార్టీ ఓటమి ఒకటి అయితే.. ఎమ్మెల్యేగా ఓడిపోవటం అనేది స్టాలిన్ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి.. సీఎంగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్.. ఎన్నికల్లో ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు డీఎంకే వర్గాలు. పార్టీ ఓడినా.. తమిళనాడులో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది డీఎంకే. పార్టీకి సొంతంగా 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరు అనేది పార్టీలో చర్చ నడుస్తుంది.
ఇప్పటికే తన వారసుడిగా ఉదయ్ నిధిని ప్రకటించారు స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల నుంచి.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉదయనిధి ఖాయం అంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీలో చాలా మంది సీనియర్స్ ఓడిపోవటం.. అనుభవం ఉన్న మంత్రులు ఓడిపోవటంతో ఉదయనిధి ఎన్నిక అనేది లాంఛనమే అంటున్నాయి డీఎంకే వర్గాలు. ఇప్పుడు స్టాలిన్ వయస్సు 73 ఏళ్లు.. వచ్చే ఎన్నికల నాటికి 78 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ వయస్సులో యాక్టివ్ గా ఉండటం అనేది కష్టం. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి ఉదయనిధికి పూర్తిగా పార్టీ పగ్గాలతోపాటు పార్టీని నడిపించే శక్తిగా మార్చాలనే వ్యూహంలో ఉన్నారు స్టాలిన్.