కేటీఆర్ది నీచమైన భాష : విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మాట్లాడే భాష తెలంగాణలో ఎవరికి రాదని విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కేసీఆర్ పరువు తీస్తున్న దరిద్రుడు కేటీఆర్ అని దుయ్యబట్టారు. బుధవారం ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య సీఎల్పీలో మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వయస్సులో పెద్దోడు అయిన కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడమని గతంలో రేవంత్ రెడ్డికి సూచించిన కేటీఆర్.. మరి వయస్సులో తన కన్నా పెద్దోడైన రేవంత్ గురించి అడ్డగోలుగా ఎలా మాట్లాడుతాడని ప్రశ్నించారు.
విప్ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. బావ కంటే గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నడని, మరోసారి ఇలాగే మాట్లాడితే గుడ్డలూడదీసి కొడ్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకొని కేటీఆర్ ఇలా మాట్లాడుతుండనే అనుమానం కలుగుతుందన్నారు. విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తిట్లతోనే రాజకీయాలు చేస్తే నాయకులు, పార్టీలు నిలబడవన్నారు. సమస్యలపై మాట్లాడే సత్తా కేటీఆర్ కు లేదని, పిచ్చి మాటలు మాట్లాడుతూ రాజకీయాలను దిగజార్చుతున్నాడని ఫైర్ అయ్యారు. విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ...రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు.