Select Location
All Locations
State
Region
City / District
అలాంటి పరిస్థితుల్లో ఆడలేను: వన్డే రిటైర్మెంట్‎పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

అలాంటి పరిస్థితుల్లో ఆడలేను: వన్డే రిటైర్మెంట్‎పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

బెంగళూర్: ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‎కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే రిటైర్మెంట్‎, 2027 వన్డే వరల్డ్ కప్‎లో ఆడటంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జట్టులో కొనసాగాలంటే పరస్పర గౌరవం ఉండాలని.. అంతేకానీ ప్రతిసారీ నా సత్తా నిరూపించుకోవాల్సి వస్తే అలాంటి పరిస్థితుల్లో తాను ఉండలేనని పరోక్షంగా బీసీసీఐకి తేల్చిచెప్పారు.

తనకు ఆటపై ఎంతో నిబద్ధత, గౌరవం ఉందని.. ఆట కోసం తాను ఏమైనా చేస్తానని.. ఇదే సమయంలో అవతలి వైపు నుంచి కూడా తనకు గౌరవం ఇవ్వాలని.. అలాకాకుండా జట్టులో స్థానం కోసం పదే పదే నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే పరిస్థితులను తాను కోరువడం లేదని.. అలాంటి పరిస్థితుల్లో ఆడటం తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాడ్‌కాస్ట్‌లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ మయంతి లాంగర్‌తో కోహ్లీ మాట్లాడుతూ వన్డే రిటైర్మెంట్, 2027 వన్డే వరల్డ్ కప్‎లో ఆడటం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఆలోచన విధానం చాలా స్పష్టం. 

నా అవసరం ఉందనుకుంటే జట్టులో భాగస్వామ్యం అవుతా. తాను జట్టులో కొనసాగాలంటే పరస్పర గౌరవం ఉండాలి. ప్రతిసారీ నా సామర్థ్యం నిరూపించుకోవాల్సి వస్తే అలాంటి పరిస్థితుల్లో తాను ఉండలేను. ఎందుకంటే నా సన్నాహాల పట్ల నిజాయితీగా ఉన్నాను. ఆటను ఎదుర్కొనే విధానంలో నిజాయితీగా ఉంటా. ఏకాగ్రతతో కష్టపడతా. నా క్రికెట్ కెరీర్‌లో నాకు లభించిన ప్రతిదానికీ నేను దేవునికి రుణపడి ఉంటా. నేను ఆడటానికి వచ్చినప్పుడు ఏకాగ్రతతో ఆడతా. భారత క్రికెట్ పట్ల తన నిబద్ధత ఎన్నడూ మారలేదు. ఇన్నేళ్లుగా తన కెరీర్‌ను తీర్చిదిద్దిన అదే క్రమశిక్షణ, తీవ్రతతో తాను సన్నద్ధమవుతూనే ఉన్నాను’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు కోహ్లీ. తాను ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ కాంప్రమైజ్ అవ్వనని.. 

ఒక వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్ల పాటు బౌండరీ చుట్టు పరిగెత్తామన్న పరిగెత్తుతానని.. దానికి తగినట్టుగానే సిద్ధమవుతానని తెలిపారు. 50 ఓవర్ల పాటు ప్రతి బంతిని నా కెరీర్‌లో ఆడబోయే చివరి బంతిగా భావించి ఆడతాననే చెప్పుకొచ్చారు. జట్టు కోసం నాతో సాధ్యమైనదంతా చేస్తానన్నారు. జట్టు కోసం ఇంత అంకితభావంతో పని చేసినప్పటికీ జట్టులో స్థానం కోసం పదే పదే నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి వస్తే అలాంటి పరిస్థితుల్లో ఆడటం తనకు ఇష్టం లేదన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నానని.. అందుకు తగ్గట్లుగా సన్నద్దమవుతున్నాని తెలిపారు. భారత్ తరఫున ప్రపంచ కప్ ఆడటం అద్భుతమని అన్నారు. కోహ్లీ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే అతడికి బీసీసీఐతో గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.


V6 News 1 hour ago
Home Flash News