Akkineni Nagarjuna : 'మే 23' నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు.. 40 ఏళ్ల సినీ ప్రస్థానంపై నాగార్జున ఎమోషనల్!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు తన కెరీర్‌లో 'మే 23'కి ఒక అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని హిస్టరీ ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం, 1986 మే 23న విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఈరోజుతో హీరోగా నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని (40 Years of Nagarjuna) దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ రికార్డులను సృష్టించిన నాగ్, ఈ స్పెషల్ డేని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అక్కినేని నాగార్జున ఈ ప్రత్యేకమైన రోజును సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మే 23.. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మా నాన్న, లెజెండరీ యాక్టర్ ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ సినిమాను నిర్మించి, విడుదల చేసే భాగ్యం 2014 ఇదే రోజున నాకు దక్కింది. నాన్నతో పాటు నా కొడుకులతో కలిసి నటించే అరుదైన అవకాశం ఆ సినిమాతోనే సాధ్యమైంది.
ఇక ఇన్నేళ్ల క్రితం ఇదే మే 23న నా మొదటి చిత్రం 'విక్రమ్' విడుదలైంది. మిమ్మల్ని అలరించడానికి, మీ దీవెనలు అందుకోవడానికి నాకు దక్కిన తొలి అవకాశం అది. ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మే 23లను సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నా.. అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు.