Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. కేవలం 58 గంటల్లో రూ.100 కోట్ల మైలురాయి!
Drishyam 3 | ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’కు ప్రత్యేక స్థానం ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో వచ్చిన తొలి రెండు భాగాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ నుంచి వచ్చిన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లతో దూసుకుపోతూ కొత్త రికార్డులకు నాంది పలుకుతోంది.
‘దృశ్యం 3’ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కేవలం 58 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు హీరో మోహన్‌లాల్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన ఆయన, “గత 13 సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్న ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ, నమ్మకం, మద్దతు మమ్మల్ని మరింత ఎమోషన్‌కి గురి చేస్తున్నాయి” అంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.117.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. మాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు..
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ‘దృశ్యం 3’ దూకుడు కొనసాగుతోంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో మూడో రోజు ఏకంగా 3.62 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు. వీకెండ్ కావడంతో ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రెండు భాగాలతో పోలిస్తే ‘దృశ్యం 3’పై ప్రారంభంలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. గత భాగాల్లో ఉన్న సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఈసారి కొంత తగ్గాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కథలో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆయన చేసే పోరాటం, గత సంఘటనల ప్రభావం, పోలీసుల ఒత్తిడి నేపథ్యంలో కథను భావోద్వేగంగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.