ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధం.. ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్స్ షెడ్యూల్ రిలీజ్
స్విట్జర్లాండ్ : ఫిఫా వరల్డ్‌కప్–2026 క్వార్టర్ ఫైనల్స్‌లో మరోసారి ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్–16 మ్యాచ్‌లు ముగియడంతో టోర్నీ కీలక దశకు చేరుకుంది. హోరాహోరీ పోరులో విజయం సాధించిన ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాయి.
ఫుట్‌బాల్ అగ్రశ్రేణి జట్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ కూడా చివరి 8లోకి దూసుకెళ్లాయి. జులై 10, 12 తేదీల్లో జరిగే నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
మొరాకో–ఫ్రాన్స్ మధ్య ప్రతీకార పోరు 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మొరాకో బరిలోకి దిగుతోంది. మరోవైపు స్పెయిన్, బెల్జియం మరోసారి తలపడుతుండగా.. యూరప్‌లోని రెండు బలమైన జట్ల మధ్య వ్యూహాత్మక పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో సంచలన ప్రదర్శనతో క్వార్టర్స్‌కు చేరిన నార్వేకు అసలు పరీక్ష ఇంగ్లాండ్‌తోనే ఎదురుకానుంది. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ మధ్య జరిగే పోరు ఈ మ్యాచ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా స్విట్జర్లాండ్‌తో తలపడనుంది. రౌండ్ ఆఫ్–16లో గెలిచిన అర్జెంటీనా.. ఆ విజయమే మరోసారి టైటిల్ దిశగా తమ ప్రయాణానికి ఊపునిస్తుందని ఆశిస్తోంది. స్విట్జర్లాండ్ కూడా మరో సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
తొలికప్పు కల కోసం బెల్జియం.. ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో మ్యాచ్‌లో స్పెయిన్, బెల్జియం జట్లు తలపడనున్నాయి. సెమీస్ బెర్త్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి ప్రపంచకప్ టైటిల్ కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో బెల్జియం బరిలోకి దిగుతోంది. అనుభవజ్ఞులు రొమెలు లుకాకు, కెవిన్ డి బ్రూయ్నెపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో స్పెయిన్- – బెల్జియం పోరు ఆసక్తికరంగా మారింది. 2010లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత తర్వాతి టోర్నీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన స్పెయిన్.. ఈసారి యువ ఆటగాళ్లతో మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. లామిన్ యమాల్, పెడ్రి, గావి, రోడ్రి, నికో విలియమ్స్ వంటి యువతరం ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నారు.