రష్యా సైన్యంలో 29 దేశాల పౌరులు! - ఐరాస నివేదిక
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి (Russia attacks in Ukraine) చేస్తోందని, తద్వారా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మద్దతు కలిగిన ఓ విచారణ నివేదిక (UN inquiry commission) వెల్లడించింది. దీని వల్ల లక్షలాది మంది పౌరులకు గడ్డకట్టే చలిలో విద్యుత్ సౌకర్యం లేకుండా పోయిందని పేర్కొంది. అంతేకాకుండా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అనేక దేశాలకు చెందిన పౌరులను రష్యా తన సైన్యంలో చేర్చుకుందని ఆరోపించింది.
ఉక్రెయిన్‌తో పోరాడేందుకు 29 దేశాల నుంచి అనేక మందిని రష్యా తన సాయుధ దళాల్లోకి చేర్చుకుందని తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. 18-60 ఏళ్ల వయసు ఉన్న పురుషులను మోసపూరిత మార్గాలు లేదా బలవంతంగా నియమించుకుందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా లభించాయని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌లో ఫిబ్రవరి 2022లో రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలుపెట్టిన కొంతకాలానికే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు చేసేందుకు జెనీవా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల మండలి (Human Rights Council) ఓ స్వతంత్ర విచారణ కమిషన్‌కు ఆమోదం తెలిపింది. ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా జరిపిన దాడులు, వాటి ప్రభావాలకు సంబంధించి దర్యాప్తు జరిపిన కమిషన్.. ఆ నివేదికను ఐరాస సాధారణ సభలోని మానవ హక్కుల కమిటీకి తాజాగా అందించింది.
మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వం.. ఆ ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ సీజ్‌ఫైర్
విద్యుత్ కోతల కారణంగా ఉక్రెయిన్‌లో లక్షలాది మంది పౌరులు గడ్డకట్టే చలిలో, చీకటిలో మగ్గిపోవాల్సి వచ్చిందని తాజా నివేదిక పేర్కొంది. క్షిపణి, డ్రోన్ దాడుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వృద్ధులకు లిఫ్టులు లేకుండా పోయాయని, ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల్లో చికిత్స పొందే రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపింది. శీతాకాలం సమీపించే సమయంలో దాడులు ముమ్మరం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
విదేశీయులను సైతం రష్యా తన సైన్యంలో నియమించుకుందని, ఇతర దేశాల్లో పనిచేస్తున్న ఏజెంట్ల సాయంతో వీటిని చేపట్టినట్లు తాజా నివేదిక తెలిపింది. 48 దేశాల పౌరుల నియామకాలపై తాము దర్యాప్తు చేశామని కమిషన్ తెలిపింది. ఇందులో 29 దేశాలకు చెందిన వ్యక్తులు మోసపూరితంగా లేదా బలవంతంగా సైన్యంలో చేరినట్లు ఆధారాలు లభించాయని వెల్లడించింది. ఈ జాబితాలో భారత్, శ్రీలంక, తుర్కియే, జోర్డాన్, నైజీరియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, ఐరాస మద్దతు కలిగిన ఈ నివేదికను రష్యా తోసిపుచ్చింది. తప్పుడు సమాచారంతో దీనిని రూపొందించిందని ఆరోపించింది.