విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడో టీ20లో సిక్సర్ల వర్షం కురిపించి మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు అభిషేక్ శర్మ. కేవలం 35 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అతడికి అంతర్జాతీయ టీ20ల్లో ఇది నాలుగో సెంచరీ. తాజా శతకంతో విరాట్ కోహ్లీ (Kohli) పేరిట ఉన్న ఓ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక (11) సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు కోహ్లీ (10) పేరిట ఉండేది. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ మూడో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (22), బాబర్ అజామ్ (13) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
అభిషేక్ ప్రస్తుతం నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) వంటి స్టార్లతో సమంగా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (5) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది అభిషేక్ (Abhishek Sharma) 37 టీ20ల్లో 1,125 రన్స్ చేశాడు. అతడు మరో 40 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ (1,164 రన్స్, 2022)ను అధిగమించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు.
30 బంతుల్లోనా?.. నావల్ల కాదు: అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మూడో భారత క్రికెటర్‌గా అభిషేక్ నిలిచాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 158 సిక్సర్లు ఉండగా.. రోహిత్ (205), సూర్యకుమార్ (179) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.