Republic Day: భారత్‌కు ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు
ఇంటర్నెట్‌డెస్క్: భారత 77వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ మొదలైన దేశాల నుంచి సందేశాలు అందాయి. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఈసందర్భంగా ఆయా దేశాధినేతలు (World leaders), మంత్రులు పేర్కొన్నారు.
‘భారత్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చైనా, భారత్ ఎప్పటికీ మంచి పొరుగువారిగా, స్నేహితులుగా ఉంటాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాం’ - చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
‘భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశం యూఎస్‌ల మధ్య చరిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. రక్షణ, ఇంధనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ అమెరికాల మధ్య సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం’ - అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
‘భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాలలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ - రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్
‘భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో భారత్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో విలువైన జ్ఞాపకం. భారత్, ఫ్రాన్స్‌ల బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరిలో కలుద్దాం’ - ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్
‘భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. భారత్-ఐరోపా యూనియన్ (India-EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. ఐరోపా యూనియన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం’ - యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్