గాల్లోకి రాకెట్ రుద్రమ..!
వరంగల్ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆ యువకుడికి చిన్నతనం నుంచి అంతరిక్షం, ఆకాశం అంటే ఎంతో ఆసక్తి. న్యాయవాదిగా పని చేస్తున్న తండ్రితో ద్విచక్ర వాహనంపై రాత్రిపూట వెళ్లేప్పుడు ‘చందమామ మన వెనకాలే ఎందుకు వస్తోంది’? వర్షం పైనుంచే ఎందుకు పడుతోంది.. వంటి ప్రశ్నలు అడిగేవాడు. ఈ ఆసక్తే ఆ యువకున్ని ఇస్రోలో ట్యూటర్‌గా చేరేలా చేసింది. బుధవారం నుంచి 27వ తేదీ వరకు ఎక్స్‌ప్లోరా కార్యక్రమం, తాను తయారు చేసిన ‘రాకెట్ రుద్రమ’ను 28వ తేదీన లాంచ్ చేయనున్నారు.
హనుమకొండ న్యూరాయపురకు చెందిన భూపతి శంకర్-శ్యామల దంపతుల కుమారుడైన శశాంక్ భూపతి హనుమకొండ హైదరాబాద్‌లోని బ్యాచ్‌లర్ ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక స్పేస్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్‌తో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ‘ఆకాశ్ స్పేస్ స్టూడియో’లో రెండేళ్లు పని చేశారు. ఆ అనుభవంతో మూడేళ్ల కిందట సొంత కంపెనీ ప్రారంభించాడు దాని తరఫున కొన్ని డిజైన్లు తయారు చేసి ఇస్రోకు పంపేవారు. ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ మౌలిక వసతులు లేకపోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇబ్బందులు పడేవారు. ఆ సమస్యకు పరిష్కారంగా రాకెట్లలో స్వల్ప విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో, అన్ని మౌలిక వసతులు ఉండేలా నమూనా రాకెట్‌ని రూపొందించారు. ఈ ప్రతిపాదనే ఇస్రోకు నచ్చి ట్యూటర్‌గా ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు రాగా, అనేక పరీక్షలను దాటి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దక్షిణాది నుంచి ఎంపికైంది శశాంక్ మాత్రమే.