ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం పార్లమెంట్‌లో చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించాలని అక్కడి ప్రతిపక్షం యోచిస్తోంది.
వాస్తవానికి, అక్కడి అంతర్గత రాజకీయాల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని అక్కడి మీడియా పేర్కొంది.
"ఈ ప్రత్యేక సమావేశానికి నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) స్పీకర్ అమీర్ ఓహానా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐజాక్ అమిత్‌ను ఆహ్వానించలేదు. ఇలా సంప్రదాయాన్ని పక్కనబెట్టడంపై ప్రస్తుతం వివాదం నెలకొంది'' అని ఇజ్రాయెల్ న్యూస్ వెబ్‌సైట్ హారెట్జ్ వెల్లడించింది.
'సగం ఖాళీగా ఉన్న పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించరు. పార్లమెంటును బహిష్కరించే ప్రతిపక్ష ఎంపీల సీట్లను భర్తీ చేయడానికి మాజీ ఎంపీలను ఆహ్వానించాలని ఆలోచిస్తున్నాం'' అని నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా అన్నట్లుగా ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ 'కాన్' వెల్లడించింది.
''పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి సంబంధించి ఐజాక్ అమిత్‌కు ఇప్పటివరకూ ఎటువంటి ఆహ్వానం అందలేదు'' అని ఇజ్రాయెల్ జ్యుడీషియల్ అథారిటీ ప్రతినిధి ఒకరు సోమవారం 'ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్'తో చెప్పారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పంపలేదన్న విషయాన్ని నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.
''సుప్రీం కోర్టు ప్రెసిడెంట్‌ను బహిష్కరించవద్దని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో ప్రతిపక్షాలు కూడా పాల్గొనేలా చూడాలని స్పీకర్‌కు సూచించాలని ప్రధాన మంత్రి నెతన్యాహును కోరుతున్నా'' అని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని యాయిర్ లాపిడ్ ఫిబ్రవరి 23వ తేదీన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో రాశారు.
''ఆ సమావేశానికి హాజరుకావాలని అనుకుంటున్నాం. మేం ఉండాలి కూడా. సమావేశంలో పాల్గొనేందుకు మమ్మల్ని అనుమతించేలా ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఓహానాను సూచించాలి'' అని ఆయన కోరారు.