నమస్తే షాలోమ్: ఇజ్రాయెల్ మీడియా ఫ్రంట్‌పేజ్‌లో మోదీ పర్యటన
ఇంటర్నెట్‌డెస్క్: ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరారు (PM Modi Israel visit). ఈ పర్యటనపై ఇజ్రాయెల్ మీడియాలో ఆసక్తి కనిపిస్తోంది. ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూసలెం పోస్ట్ ఫ్రంట్ పేజ్‌లో ప్రచురించిన కథనమే అందుకు కారణం. నమస్తే అని హిందీ భాషలో.. షాలోమ్ అని హిబ్రూ భాషలో ప్రధాన శీర్షిక పెట్టి వార్త రాసింది.
ఇజ్రాయెల్ (Israel) అధికారిక భాష హిబ్రూ. ఆ భాషలో షాలోమ్ అంటే శాంతి అని అర్థం. అలాగే ఎవరినైనా పలకరించడానికి కూడా ఆ పదాన్నే వాడతారు. ఆ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జ్వికా క్లీన్.. బుధవారం ఎడిషన్ ఫ్రంట్ పేజ్‌ను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మోదీ అభివాదం చేస్తోన్న ఫొటోను ఆ కథనంలో వాడారు. అలాగే భారత్-ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు ఇజ్రాయెల్‌లో మోదీ (PM Modi) ల్యాండ్ అవుతారు. 2017లో మోదీ తొలిసారి ఆ దేశంలో పర్యటించారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్ కెనెసెట్‌లో ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని అక్కడి పార్లమెంట్ వేదికగా మాట్లాడలేదు. తాజా పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులూ గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన పలు అంశాలపైనా చర్చించనున్నారు. 41 వేల మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. వారితో మోదీ సంభాషించే అవకాశం ఉంది.