గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. అమరావతి మీదుగా చెన్నై వరకు ఈ మహా ప్రణాళికను అమలు చేయనున్నారు. రైల్వే నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కేవలం 3 నుంచి 3.30 గంటల్లోనే చెన్నైకి చేరుకోవచ్చు.
అమరావతికి కేవలం గంటన్నర లోపే వెళ్లవచ్చు. ఈ కారిడార్ నిర్మాణానికి సుమారు రూ.1.86 లక్షల కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి పట్టాలెక్కించేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైవేతో పాటే రైలు మార్గాన్ని వేస్తే భూసేకరణ సులువవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు రైల్వే బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది.
రాష్ట్ర సూచనతో మారిన రూట్
ఈ హైస్పీడ్ కారిడార్ అలైన్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనతో ప్రాజెక్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. తొలుత ఈ హైస్పీడ్ రైలు కోసం రైల్వే శాఖ హైదరాబాద్–శంషాబాద్– నార్కట్‌పల్లి–సూర్యాపేట-– ఖమ్మం మీదుగా ఏపీలోని అమరావతిని కలుపుతూ చెన్నైకి అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించింది. అయితే, ఈ రూట్‌కు బదులుగా కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పక్క నుంచే రైల్వే లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో రైల్వే శాఖ, పాత రూట్‌ను పక్కనపెట్టి కొత్త అలైన్‌మెంట్‌కు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మిర్యాలగూడ మీదుగా సాగే కొత్త మార్గంలో ప్రాథమిక సర్వే పూర్తి చేసి, అలైన్‌మెంట్ డ్రాఫ్ట్‌ను రైల్వే బోర్డు సిద్ధం చేయడం గమనార్హం.