వాణిజ్య ఒప్పంద ఫలాలు అందుకోవాలి
దిల్లీ: వివిధ దేశాలతో మనదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా కలిగే అవకాశాలను ఒడిసిపట్టేందుకు, పెట్టుబడులను వేగవంతం చేయాలని పరిశ్రమ సంఘాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకోవడంతో పాటు, పరిశోధనలకూ పెద్దపీట వేయాలని 2026-27 వార్షిక బడ్జెట్‌పై నిర్వహించిన రెండో వెబినార్‌లో ప్రధాని పేర్కొన్నారు. విశ్వసనీయ తయారీ భాగస్వాముల కోసం ప్రపంచ ఎదురు చూస్తున్నందున, భారత్ బలమైన పాత్ర పోషించాలని చెప్పారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని ఉద్బోధించారు. ఇంకా ప్రధాని ఏమన్నారంటే..
వాణిజ్య ఒప్పందాల ద్వారా మన ఎదుట అవకాశాలు కనిపిస్తున్నప్పుడు.. వాటిని అందుకునేందుకు మనకున్న ఏకైక మంత్రం నాణ్యతే. దీని విషయంలో రాజీ పడకూడదు. ఎక్కువ మేధ వాడాల్సిన, దృష్టి సారించాల్సిన విభాగం ఏదైనా ఉందంటే అది నాణ్యతే. మన ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉండాలి.
ఇతర దేశాల అవసరాలను అధ్యయనం చేయాలి. విస్తృత పరిశోధనలు నిర్వహించాలి. ఆ విపణుల్లో వినియోగదార్ల ప్రాధాన్యాలను, సౌలభ్యాలను అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఉత్పత్తులను సృష్టించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. నాణ్యతే మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అప్పుడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాల నుంచి ప్రయోజనం పొందగలం.
మన మార్గం సుస్పష్టం. మరింత అభివృద్ధి చేయాలి.. ఉత్పత్తి చేయాలి... ఎగుమతులు చేయాలి. అయితే మార్గం ఉన్నంత మాత్రాన ఫలితాలు వాటంతట అవే రావు. పరిశ్రమ, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే సంకల్పం కార్యరూపం దాలుస్తుంది.
సమష్టి కృషితోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుంది. ఇందుకోసం అవసరమైన నిర్ణయాలను బడ్జెట్‌లో తీసుకున్నాం. వీటి ద్వారా ఫలితాలను మీరు రాబట్టాలి. తయారీ, లాజిస్టిక్స్, ఎంఎస్‌ఎమ్‌ఈలు, చిన్న, పెద్ద నగరాలు.. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు వేర్వేరు మూలస్తంభాల లాంటివి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం అయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.