ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైనా చావే గతి.. ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా అంతమొందిస్తామని ఇజ్రాయెల్-అమెరికా స్పష్టం చేశాయి. ఇరాన్కు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. భవిష్యత్తులో ఏ ఇరాన్ సుప్రీం నాయకుడైనా బతికి బట్టకట్టేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అలీ అయతుల్లా ఖమేనీ పెద్ద కొడుకు మోజ్తాబా ఖమేనీ (56) ఎన్నికైనట్లుగా ఇరాన్ మీడియాలో వార్తలొచ్చాయి. మోజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టుగా ప్రచారం జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు ఎన్నికైనా టార్గెట్ చేస్తామని, చావు తప్పదని కీలక హెచ్చరిక చేయడం గమనార్హం.
ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, అమెరికాను బెదిరించడానికి, ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ప్రయత్నించే ఎవరినైనా అంతం చేస్తామని కాట్జ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత నిర్వర్తించే ఇరాన్ నిపుణుల అసెంబ్లీతో సంబంధం ఉన్న బిల్డింగ్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. టార్గెట్ చేసిన కొంతసేపటికే ఈ హెచ్చరిక వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్.. 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే.