సైలెంట్ గా ఉండడం అంటే..బాధ్యతల నుంచి తప్పించుకోవడమే: మోదీ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్
స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిదికాదని కామెంట్
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో మౌనంగా ఉండటం అంటే తటస్థంగా ఉండటం కాదని, అది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అని ఆమె విమర్శించారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-–ఇరాన్ సంబంధాలు కేవలం వ్యూహాత్మకమైనవి మాత్రమే కాదని, అవి చరిత్రాత్మకంగా బలమైనవని పేర్కొన్నారు. ‘‘మార్చి 1న తమ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హత్య చేశాయని ఇరాన్ ధ్రువీకరించింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను ఇలా చంపడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇలాంటి సమయంలో భారత్ సర్కారు మౌనం వహించడం ఆశ్చర్యకరం” అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ తీరుపై సోనియాగాంధీ మండిపడ్డారు. ‘‘మొదట్లో అమెరికా-–ఇజ్రాయెల్ దాడులను పట్టించుకోకుండా, యూఏఈపై ఇరాన్ చేసిన ప్రతీకార దాడిని మాత్రమే ప్రధాని ఖండించారు. ఆ తర్వాత ‘తీవ్ర ఆందోళన’, ‘చర్చలు–-దౌత్యం’ లాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేయకముందే అక్కడ దౌత్య చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన మర్చిపోయారు” అని ఎద్దేవా చేశారు.